BHAGAVATA KADHA-3    Chapters   

ఖాండవ దహనమునఁ గృష్ణ కృప

51

శ్లో || యస్సన్నిధావహము ఖాండవమగ్న యే7దా

మింద్రం చ సామరగణం తరసా విజిత్య |

లబ్ధా సభా మయకృతాద్భుత శిల్పమాయా

దిగ్భ్యో7హరన్‌ నృపతయో బలిమధ్వరేతే ||

---శ్రీభాగ. 1 స్కం. 15 అ .8 శ్లో.

"కం. దండి ననేకులతో నా

ఖండలుఁ డెదురయిన గెలిచి ఖాండవ వనముం

జండార్చికి నర్పించిన

గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుట నధిపా.

కం. దిక్కుల రాజుల నెల్లను

మ్రక్కించి ధనంబుఁగొనుట మయకృత సభ ము

న్నెక్కుట జన్నము సేయుట

నిక్కము హరి మనకు దండ నిలుచుట గాదే.

కం. మన సారథి మనసచివుఁడు

మన వియ్యము మనసఖుండు మనబాంధవుఁడున్‌

మన విభుఁడు గురుఁడు దేవర

మనలను దిగనాడి చనియె మనుజాధీశా."

----శ్రీ మదాంధ్ర భాగవతము

ఛప్పయ

జనకీ లహికేఁ కృపా అకారజ కారజ కీన్హేఁ |

విప్రవేష మహఁ వన్హి ఆఇ వర మాంగే దీన్హే ||

సన్నిధి సమరీ&ు శ్యామ, భోజ్య బహు ఖాండవ దీన్హో |

అతి ప్రచండ ధరి రూస దాస వన సబరో కీన్హో ||

దేవరాజ రక్షా కరీ, కింతు పరాజిత వే భ##యే |

ధరాధామ తాజ ధామనిజ, అజ అచ్యుత అబ చలి గయే ||

అర్థము

ఎవని కృపా తేజస్సులు అకార్యములను గూడ సకార్యములుగ నొనర్చెనో అట్టివాఁడు విప్రవేషమును ధరించి వచ్చిన అగ్నికి వరములొసంగి, ఆతనికి భోజ్యముగా ఖాండవనము నొసంగెను. అప్పుడగ్ని అతి ప్రచండరూపమును ధరించి వనము నంతను గాల్చివేసెను. అప్పుడింద్రుఁడు ఆ వనమును రక్షింపఁ దలఁచెను గాని యాతఁడట్లు చేయలేక పరాజితుఁడాయెను. అట్టి పనులొనరించిన అజుఁడు, అచ్యుతుఁడైన శ్రీకృష్ణుఁడిప్పు డీభూమిని వదలిపోయెను గదా !

----

ధర్మరాజు దుఃఖమున కంతు కనఁబడలేదు. నీరులేని బురదగుంటలోని చేఁపలెట్లు సూర్యకిరణములచే సంతాపమును జెంది తడపడ కొట్టుకొనునో అట్లే ధర్మరాజుకూడ కృష్ణవియోగముచేఁ గొట్టుకొనుచుండెను. అర్జునుఁడూరకున్న తర్వాత నాతఁ డిట్లనెను :- " సోదరా ! అర్జునా ! నీవు దేవకనందనునకుఁ బ్రియసఖుఁడవు. అభాగ్యుఁడనగు నన్నాతఁడెక్కువగ గౌరవించెడివాఁడు. ఆకారణమున నాతఁడు నా దగ్గఱ కొంచెముగ లజ్జించెడువాఁడు; కాని నీ వాతనికి అభిన్నహృదయుఁడవు. ఆతఁడు నీ దగ్గఱ నేమాత్రము సంకోచము లేక మెలఁగెడువాఁడు. ఆతఁడు వెళ్లినచోటకు నిన్నుఁ గొనిపోయెడువాఁడు. నీవులేక ఆతఁడొంటరిగాఁ దిననైనఁ దినెడువాఁడు కాఁడు. మనకాతఁడే యీ లోకమున నాధారము. ఆతఁడు లేక మనము జీవింపఁజాలము. నీ వాతని చరిత్రను జెప్పి భావజగత్తులో నాతని సాక్షాత్కారము కావించు చున్నావు. కాఁబట్టియే మనమింతవఱకు బ్రదుకఁగలుగుచున్నాము. ఇప్పుడు మనకాతని స్మృతిమాత్రమే ఆధారముగ నీ లోకమున నిలిచినది. ఆతని లీలాస్మరణమువలననే మన మేదోవిధమునఁ బ్రాణముల నిలుపుకొనఁగలము. తమ్ముఁడా ! నీవూరకుండఁబోకుము. ఆతని స్మృతి కలుగఁజేయుము. ఆతని గుణగానము చేయుము. ఆ మూలమున నా శోకసంతాపములు కొంచెము తగ్గుచున్నవి. ధ్యానములో నే నా నందనందనుని దర్శనము చేయుచున్నాను. ఆతని వియోగ దుఃఖము ఆతని లిలాశ్రవణముచే విస్మృతమగు చున్నది. కావున నాతని గూర్చి యింకొక విషయము చెప్పుము. అన్యవిషయము లక్కఱలేదు. నిద్ర నేత్రములనుండి పోయి భగవంతుని వెదుక పోయినది. ఈ శోకపూర్ణమగు రాత్రి నెట్లో జరుపవలయును. ఇంకేమైన పనులుండిన రేపుప్రొద్దున చేసికొన వచ్చును. ఉదయాచలమునుండి భువనభాస్కరుఁడుదయించఁగానే భవిష్యత్కార్యక్రమమాయనే చెప్పఁగలఁడు. అంతవఱకు నీవు త్రైలోక్య పావనుఁడగు ద్వారకానాథుని గూర్చి చెప్పుచుండుము."

ధర్మరాజిట్లని యూరకుండెను. ధర్మరాజుని తమ్ములు, మంత్రులు, ప్రధానులగు నధికారులు వేయేల నందఱును బాషాణ ప్రతిమలవలె శోకసంతప్తులై నిశ్చలభావముతోఁ గూర్చిండిరి. వారు కాల్యకృత్యములు, స్నానసంధ్యాదులు, ఆహారపానీయములను మఱచిరి. వారందఱు అశ్రువులను గార్చుచుఁ నర్జునుఁడు చెప్పు శ్రీకృష్ణకృపాకథను వినుచుండిరి. కన్నుల నీరు తుడుచుకొని, చీదుకొని, గొంతుసవరించుకొని దుఃఖించుచు నర్జునుఁడిట్లనెను :- " రాజా ! ఒక్కటైనఁ జెప్పఁగలను. నా రోమరోమములందు ఆతని యనంతోపకారములు నిండియున్నవి. ఒక్కొక్క రోమము నకు కోటికోటి జిహ్వలుండి కల్పాంతమువఱకు వర్ణించినను ఆతని యుపకారములు తరుగవు. బ్రహ్మాదిదేవతలకుఁగూడ దుర్లభములగు లీలలను, దృశ్యములను ఆతఁడు చూపించెను. ఇంద్రాగ్ని వాయువులు మొదలగు దేవతలు ఆతని సమ్ముఖమున చేతులు జోడించి నిలుచుండెడువారు. బాలుఁడు కాగితపు బొమ్మలతో నాడుకొనినట్లు వారి నొక్కక్కప్పుడు కాగితము నుదిపారవేసినట్లు ఊదిపారవేసెడువాడు. ఒక్కొక్కప్పుడాకాశమున కెక్కించెడివాఁడు. బొమ్మలను జేయుట ఆతని కాట. వాని నెగుర వేయుట, ఆడించుట, ఉబ్బించుట, త్రిప్పుటకూడ ఆతనికాటయే. వాటిని పగులగొట్టునప్పుడు కూడ ఆతనికి మనోరంజనమే. శబ్దము చేసి పగిలిన పకపకనవ్వుచుఁ జూచుచుండును. అట్టిస్థితిలోఁ గూడ నాతనికి శోక సంతాపములు లేవు. ఒకవిధమగు నానందమునే యనుభవించును. దేవత లాతని మనుషరూపమునుజూచి మోహములోఁబడి, అప్పుడప్పుడు సాధారణ మనుష్యుఁడుగ వ్యవహరించుచుందురు. ఆసమయమున నాతఁడుకూడ సామాన్య మానవునివలె వ్యవహరరించును, అట్టి చేష్టలచే చూపించును. దీనివలన నాతనికి మానవీయలీలలు మిక్కిలి సుఖప్రదముగను, సరసము గను ఉండును. మానవీయ భావములలో దివ్యలీలలు ప్రకటమగుచుండును.

మీకు జ్ఞాపకముండవచ్చును. మీ యాజ్ఞను గొని మే మొకసారి యమునాతటమునకు వినోదార్థము జలక్రీడలకై వెళ్లి యుంటిమి. ఏకాంతమున నన్ను నాతఁడెంతో ప్రేమించెను. తన అపారప్రేమచే నన్నాచ్ఛాందిచెడువాఁడు. నేనా ప్రేమ ప్రవాహములో నన్ను నేను మఱచునట్లు కొట్టుకొనిపోయెడువాఁడను. ఆతఁడు స్నేహవశమున చాలమంది నట, నర్తక, గాయక, దాస, దాసీజనములను నావెంటఁ బంపెడువాఁడు. కాని నా కివేమియు సంతోషముగ నుండెడివికావు. నా సంతోషమున కాధార మా ప్రసన్నముఖుఁడగు మదనమోహనుఁడే. యమునాతీరమునకు వెళ్లి మేమందఱమును యథేష్టముగ వినోదములు కావించితిమి. ఆతఁడు నన్ను యమునానదిలోనికిఁ గొనిపోయి చాలసేపటివఱకు జలక్రీడావినోదములో ముంచెను. నాతో పందెము వేసి యీదును, నామీఁద జలములఁజిమ్ముచుండును, నీరు కొట్టి న్నాకుల పఱచును. అప్పుడు నే నాతని ఁ గట్టిగాఁ బట్టుకొనెడివాఁడను. ఆహా! ఆతని స్పర్శ యెంత సుఖకరముగ నుండెడిది ! ఆతని శ్రీయంగములకాంతి యెంత ఆనందకరమైనది ! ఆ దినము లిప్పుడు స్వప్నతుల్యము లయ్యెను. ఆ విషయములు పూర్వజన్మ విషయములవలె దోఁచుచుండెను.

జలక్రీడ చేయుచుఁజేయుచు నలసిపోఁగా నాతఁడు స్నేహ భరిత వాక్కులతో నిట్లనెను :- " అర్జునా ! ఈ గుంపులో నా మనస్సానందము చెందుటలేదు. వెళ్లుదము పద, ఏకాంతమునకు వెళ్లి కూర్చుందము."

"గ్రుడ్డివాఁడా ! గ్రుడ్డివాఁడా ! నీకేమి కావలయునురా ? యనినఁ జూచుటకు కన్నులు కావలయు" నన్నట్లు నేను నదే కోరుచుంటిని. నన్ను ఁ దీసికొనిపోయి ఆతఁడొక నికుంజములోఁ గూర్చుండెను. నాతొడమీఁద నాతని శిరముంచి పరుండెను. అమృతమయ దృష్టిని నాదృష్టియందు బఱపి, నాహృదయములోం బ్రేమరస సంచారము కావించుచు, ననేక రహస్య విషయములను జెప్పుచు నాతఁడు నాకీ భూమిమీఁదనే వైకుంఠ లోక సుఖణుల నొసంగెను. మనసొక్కటైన మిత్రత లభించిన వాని అదృష్టమే అదృష్టము. ఒకఁడు తనమిత్రునకు ఆంతరంగిక రహస్యవిషయములు చెప్పుచుండిన నప్పుడు లోకమంతయు మఱపునకువచ్చును. ఈ లోకమున కావలనున్న సుఖమయమగు భావమయ జగత్తులో ఆమిత్రులిద్దరు సంచారము చేయుదురు. నేనుగూడ అట్టి యనుపమప్రేమ రసాస్వాదనము చేయుచున్న సమయములో తాటిచెట్టంత పొడవు కలిగి, పరమ తేజస్వియై, యెఱ్ఱనిమీసములు, గడ్డములు కలిగిని బ్రాహ్మణుఁడొకఁ డచ్చటికి వచ్చెను. ఆసమయమున నా బ్రాహ్మణుఁడు వచ్చుటచే రసభంగమయ్యెను. రసభంగమువలన నేకత్వములో ద్వైతము ప్రవేశించెను. నిస్సంకోచములో సంకోచము ప్రవేశించుటచే నంతయు విలకలమయ్యెను. మేమిద్దరమును బ్రాహ్మణుని సమ్మానించుటకు లేచి నిలువఁబడితిమి. రాఁగానే యాతేజస్వియగు బ్రాహ్మణుఁడిట్లనెను :- " నేను చాల ఆఁకలి చెందియున్నాను. నా కేదైనఁ దిన నా హార మీయవలయును."

నేనిట్లనఁబోవు చుంటిని :- ' ఓ భూసురోత్తమా ! భోజనముకొఱకు మీరు మా ఐకాంతిక రసమునకు విఘ్నమేల కావించితిరి ? మా సేవకులవద్ద కావలసినంత భోజనమున్నది. వారినడుగ వచ్చునే !" ఇంతలో శ్రీకృష్ణుఁడు వారింపఁగా నేనేమియు ననలేదు. అంత భవభయహారియు, మేఘశ్యాముఁడు నగు నా కృష్ణుఁడు మేఘగంభీరస్వరముతో నాబ్రాహ్మణునితో నిట్లనెను :- " విప్రోత్తమా ! నీవు సాధారణ బ్రాహ్మణుఁడవుగఁ గనఁబడుట లేదు. సాధారణమగు భోజనముతో నీకు తృప్తియగునట్లు లేదు. కావున ముందు నీకెట్టిభోజనము కావలయునో నిర్దేశించుము. మీ భోజనవిషయమును విని మేము నిన్ను దృప్తి పెట్టఁగలమో లేమో తర్వాత నిర్ణియించెదము."

శ్రీకృష్ణుని వాక్యములు వినఁగానే నేను తికమక పడిపోయితిని. తర్వాత కొంత కుదుట పడితిని. ఇంతవఱకు నేనెవరిని సామాన్య బ్రాహ్మణుఁడనుకొనుచుంటినో అట్టివానికి భోజనము పెట్టి తృప్తి పెట్టుటకు అఖిల బ్రహ్మాండములను దృప్తి పెట్టుశ్యామసుందరుఁడు కూడ శంకించుచుండెను. ఆ బ్రాహ్మణుఁడు సూర్యకిరణములతో సమానముగ నున్న తన యెఱ్ఱని గడ్డము నాడించుచు నవ్వి యిట్లనెను :- " దేవా ! నేను సాధారణ బ్రాహ్మణుఁడను గాను. నేనగ్నిహోత్రుఁడను. నాకజీర్ణరోగము పుట్టుటచే నీసమీపమున నున్న ఖాండవవనమును దగులఁబెట్ట వలెననుకొనుచున్నాను. దీనిలోఁగల యక్ష, రాక్షస, అసుర, నాగ, సర్పాదుల మాంస మేదస్సులఁ దగులఁబెట్టుటచే నాకు తృప్తి కలుగును. ఈ వశమును భస్మము చేయుటచేతనే నాకీ యజీర్ణము పోవును. "

భగవానుఁడిట్లనెను :- " అయితే తగుల బెట్టుము. మమ్ముల నడుగుట ఎందులకు ? నీవు హుతాశనుఁడవు. సమస్త బ్రహ్మాండమును భస్మముచేయ సమర్థుఁడవు."

అగ్ని ఖేదస్వరమున నిట్లనెను :- " ఎట్లు తగులఁబెట్టుదును ! దీనిలో తక్షకుఁడు సపరివారముగ నివసించుచున్నాఁడు. ఆతని కింద్రునితో స్నేహము. ఆకారణమున నింద్రుడీ వనమును రక్షించుభారము తనపై ఁ బెట్టుకొనెను. నేను తగులఁబెట్టుటకుఁ బ్రారంభించితినా వెంటనే యింద్రుడు వర్షము కురిపించి దాని నార్పివేయుచుండెను. అందువలన నది నావశమగుటలేదు. అనేక సార్లు ప్రయత్నించతిని. కాని అది వ్యర్థమై పోయినది. నీ వస్త్రశస్త్ర విశారదుఁడవు. మీరు తలఁచుకొనిన నింద్రుని వర్షమును మీ అస్త్రములచే నాపి నా మనోరథమును బూర్తి కావింపఁ గలవు."

రాజా ! ఆతనికి అస్త్రశస్త్ర జ్ఞానము బొత్తుగా లేనట్లు ఏదైన అస్త్రశస్త్రములతోఁ బనిపడిన నావైపు చూచును. దేవతలంద ఱొక్కటై కూడ చేయలేని కార్యములను నేనాతని అండచూచుకొని చేసెడువాఁడను. మర్త్యలోకములో నెవరును జేయఁజాలనట్టి ఘోరప్రతిజ్ఞలను జేయుచుందును. శ్రీకృష్ణుని ప్రవృత్తిని గాంచి నే నిట్లంటిని :- " అగ్నిదేవా ! నీవు నిశ్శంకుఁడవై ఖాండవ వనమును దహింపుము. నిన్ను నేను రక్షించెదను. ఒక యింద్రుఁడు కాఁడు, నూర్గురింద్రులు వచ్చినప్పుటికిని జయింపఁజాలనట్టి బలసాహసములు నాబాహువులలోఁగలవు. అయితే నాబలమునకుఁదగినట్లు నావద్ద రథము అస్త్ర శస్త్ర ములు లేవు. అది యెంతటి గట్టి ధనువైనఁ గానిండు, నేను బలాత్కారముగ లాగితినా అది నా బలాధిక్యతచే విఱిగిపోవు చుండును. నేనత్యంత లాఘవమున రెండుచెతులతో నొక్కసారిగా నత్యంత శ్రీఘ్రముగ బాణములను వదల గలను. ఎన్ని బాణము లున్నను నిమిషములో పట్టుపడి పోవుచున్నవి. కాఁబట్టి నీవు నాబలమున కనురూపముగ నుండు దివ్యధనుస్సును , అక్షయ తూణీరమును, నావేగమును సహించు దివ్యరథము నొసంగు నెడల నేను శ్రీకృష్ణుని సహాయముచే నీకోరికను నెఱవేర్పఁగలుగుదును."

నా మాటలను విని నందనందునుఁడు నవ్వెను. అంత నగ్ని దేవుఁడు ప్రసన్నుఁడై నాకు జగత్ర్పసిద్ధమగు గాండీవమును, అక్షయతూణీరమును, ఏ రథధ్వజముపై మారుతి యుండునో అట్టి దివ్యరథమును ఇచ్చెను. అగ్నిహోత్రుఁడు శ్రీకృష్ణునకుఁ గూడ సత్కారార్థము చక్రమును ఆగ్నేయాస్త్రము నొసంగెను. నిజమున కాతని అస్త్రముల కవసరమేమి కలదు ? ఆతఁడు సంకల్పముచేతనే సమస్తసృష్టిని విలీనము చేసికొనఁగలఁడు; కాని యాతఁడగ్ని నవమానింపలేదు. ఆతఁ డస్త్రమును భక్తితో గ్రహించెను.

రాజా ! అగ్నిహోత్రుఁడు ఖాండవవనమును దహించుటకుఁ బ్రారంభింపఁగనే దేవతాప్రేరణచేఁ దనబలములతో దానినిరక్షించుట క్రింద్రుఁడు వచ్చెను. ఆతఁడు రాగాఁనే మమ్ముల నెదుర్కొనెను. అంతనేను నాగాండీవ ధనుస్సును నారిమ్రోగించి శ్రీకృష్ణుని అండను నిలువఁబడి దేవతలమీఁదను, దేవేంద్రుని పైనను బాణవర్షము గుఱియించితిని. నాబాణవర్షమున కాగలేక దేవతలందఱు తమ తమ ప్రాణములను గుప్పిటను బెట్టుకొని యుద్దమునుండి పారిపోయిరి. మాయిద్దరి బలపరాక్రమములను జూచి యింద్రుఁడుకూడ పారిపోయెను. నాతండ్రియగు నింద్రుఁడు ఆసమయమున లజ్జించెను, హర్షించెనుగూడ. ఆతఁడోడిపోవుటచే లజ్జించెను. ఆతని కొడుకునగు నా పరాక్రమమునుగాంచి హర్షించెను. రాజా ! అది నాపరాక్రమముకాదు. ఆపురాణపురుషుఁడిచ్చిన బలవీర్యములు. ఆతఁడిచ్చిన పరాక్రమ మాతని తోడనే పోయినది. నేనిప్పుడు సాధారణులవలె నిర్వీర్యుఁడనే అయితిని.

ఆహా ! ఆసమయమున భగవంతుని శోభ యేమని పొగడుదును ? అగ్నిదేవుఁడు ఖాండవ వనమును దగులబెట్టుచుండెను. నలువైపుల ఛట ఛటా శబ్దము లుప్పతిల్లెను. సింహ, వ్యాఘ్ర, భల్లూక, పశు, పక్షి, నాగ, సర్పాది సమస్తజీవులు దహనమై పోవుచున్నవి. శ్రీకృష్ణుఁడు నారథముతోఁబాటుగా నలాతచక్రమువలె నరణ్యమునకు నలువైపుల పరిభ్రమించుచుండెను. ఏజీవియైన అగ్నిజ్వాలనుండి తప్పించుకొనెనా మేము మాయస్త్రములచే దానిని గొట్టెడివారము. దైవయోగముచే నింద్రుని మిత్రుడగు తక్షకుఁడా సమయమునఁ గురుక్షేత్రమునకుఁ బారిపోయెను. ఆతఁడగ్ని నుండి తప్పించుకొని, దైత్యదానవులకు సుప్రసిద్ధ శిల్పి యగు మయుని దగ్గఱ శిల్పవిద్యనంతను గ్రహించి యాదానవుని దగ్గఱనే దాఁగుకొనెను. మయదానవుఁడు కూడ కురుక్షేత్రమునకే పారిపోయెను. అగ్నిహోత్రుఁడు వాయుసహాయముచే దానిని భక్షణము చేయుటకు వెంటఁబడెను. అగ్నిజ్వాలలను గాంచి మయుఁడు ఒక గుప్తమార్గమునఁ బారిపోయెను. ఆతఁడు తన యెదుట చక్రముతో ప్రాణిసంహారము చేయు కృష్ణునిఁ గాంచెను. మయుఁడు పారిపోవుచుండఁగా శ్రీకృష్ణుఁడు చక్రముతీసికొని వెంబడించెను. రాజా ! ఎవనిని అగ్నిహోత్రుఁడు తన జ్వాలలచే వెంబడించుచున్నాఁడో, శ్రీకృష్ణుఁడు చక్రము తీసికొని ఎవనిని దరుముచున్నాఁడో అట్టివానిని రక్షింపఁగలవాఁడెవఁడున్నాఁడు ? శ్రీకృష్ణ చక్రమునుండి రక్షింపఁగలవాఁడెవఁడు ?

మయునకు లోకమున రక్షుకులెవరును లేరని తెలియఁ గానే ఆతఁడు నన్ను శరణు వేఁడెను. ఆతఁడు కరుణా భరితము లగు వాక్కులతో నన్నుసంభోదించుచు నిట్లనెను :- " పాండవ నందనా !ప్రచండాగ్ని నుండియు, శ్రీకృష్ణచక్రము నుండియు, నన్ను రక్షింపుము."

నేనప్పుడు ఆవేశమున నిట్లంటిని :- " నీవు నిర్భయుఁడ వైతివి. ఇఁక నీవు ప్రాణభయమును జెందరాదు."

ఇంకొక వీరుఁడగునెడల నిది తన కవమాన మనుకొనుము. తోఁబుట్టిన వాఁడగుఁగాక తన శత్రువు విషయములో జోక్యము కలిగించుకొనెనా వ్యధచెంది తీరును. కాని అప్పుడు శ్రీహరి నవ్వి, ప్రసన్నుఁడై మయునితో నిట్లనెను :- " దానవో త్తమా ! మయా! నీవిప్పుడిఁక జింతింపవలదు. కుంతీపుత్రుఁడు అభయదాన మొసంగిన వానిని శిక్షింపఁగలవాఁడి లోకమున నెవఁడు కలఁడు?"

ఆతఁడు తన సేవకుల నెంతో కృపతో ఁజూచును. వారి వాక్యములను గౌరవించును. తన ప్రతిజ్ఞను భంగపఱచుకొని యైన నాతని ప్రతిజ్ఞను నెఱవేర్చును.ఆతని భగవత్వమున కిది అనురూపముగనే యున్నది. మానవులలో నీశక్తి యెవరికుండును? ఇట్టి సహనము చూపించు శక్తి ఆతనికే తగినది.

ఈయుపకారమునకై మయుఁడు ప్రత్యుపకారము చేయఁ దలఁచెను. అంత నేనా తనితో నిట్లంటిని :- " మయా !నాకు ముఖ్యమగు కార్యము శ్రీకృష్ణప్రసన్నత. ఆతఁడు ప్రసన్నుఁడగు కార్యము నేదైనఁ జేయుము."

ఆతఁ డంత శ్రీకృష్ణునిఁ బ్రార్థించెను. మయుని ప్రార్థన నంగీకరించి సర్వాంతర్యామియగు శ్రీకృష్ణుఁడు కొంచెము సేపూరకుండి యాలోచించుచుండెను. ఆ సమయమున నాతని చింతాయుక్తమగు ముద్ర యెంత యందముగ నుండెనో చూచితీరవలెను. ఆతఁడిట్లాలోచించుకొనెను :- ' నాకన్నిటికంటె బ్రియమగు కార్యమేది '? అని యాలోచించి యిట్లనెను :- "మయా ! నీవు నన్ను ఁ బ్రసన్నుని జేయఁదలచిఁచితివేని ధర్మరాజునకు ప్రపంచములో సాటిలేని ఒక సభను నిర్మించుము. దైత్య, దానవ, దేవగంధర్వాదు లెవరును దానిని నిర్మింపలేనట్లుగ నుండవలెను. ఇంత కంటె నాకీ ప్రపంచములో ఁబ్రియమైన కార్యములేదు. ధర్మరాజు ఆసభలో బంగారు సింహాసనమున చక్రవర్తియై కూర్చుండిన చూచి సంతోషించుటకంటె నాకొక సంతోషకరమగు కార్యములేదు."

రాజా ! ఇదియే యాతని భక్తవత్సలత. ఇదియే ఆతనికి మనమీఁదఁగల ప్రీతి. ఇదియే ఆతనికి మనయెడలఁగల నిష్కపట ప్రేమపూర్ణమగు సద్వ్యవహారము. శ్రీకృష్ణ కృపచేతనే మనకాసభ లభించినది. ఆ సభలోనేకదా మీకు రాజసూయ యాగసమయమున భూమియందలి రాజులందఱు నుపహారములు తెచ్చి సమర్పించిరి. ఆ సభలోనేకదా దుర్యోధనునకు జలమున్న చోట స్థలముగను, స్థలమున్నచోట జలముగను గనఁబడినది. శ్రీకృష్ణ కృపచేతనే లోకములో సర్వశ్రేష్ఠమగు సభ మీకు లభించినది. ఆతఁడు నన్ను ప్రేమతోఁ బాలించి, పోషించి ఆకాశమునకంటెఁబైకి యెత్తిపట్టెను. నాకు నాసౌభాగ్యమునకు గర్వము కలిగెను. ఆసంగతి నేను చివరకు తెలిసికొంటిని. హృదయమునుగదలించి వేయునట్టియు, నాతని ఆంతరిక ప్రేమను బ్రకటించునట్టియు నొక సంఘటన చివరకు జరిగినది.

ఇంద్రునకుఁ దాసు దేవరాజునని గర్వము. ఖాండవ వనమును దహించినతర్వాత, అగ్ని దేవుఁడు సంతుష్టుఁడైన తర్వాత నింద్రుఁడు మా దగ్గఱకు వచ్చి వరముల డుగుకొమ్మనెను. నాకు లోకములో సర్వశ్రేష్ఠుడును, అద్వితీయుఁడునగు యోద్ధ కావలెనను కోరిక కలదు. నేను దేవేంద్రుని సర్వశస్త్రాస్త్ర సంపన్నుని గను, అద్వితీయ వీరునిఁగను జేయమని వర మడిగితిని. ఆతఁ డొసంగెను.

సమస్త వరదానము లొసంగు శ్యామసుందరుని గూడ వరములగడుగుమని కోరు సాహసమును దేవేంద్రుఁడు కనఁబరచెను. శ్రీకృష్ణుఁడమరేంద్రునిఁ దిరస్కరింపలేదు. నేను నిన్ను దేవేంద్రునిఁగ నొనర్చితినిగదా, నావద్ద నిట్టి సాహసము చేయుచున్నావు, నీవేమి వరము లీయఁగలవని యడుగలేదు సరిగదా వినిన రోమాచమగునట్టు వరదానమును ఆతఁడు దేవేంద్రు నడిగెను. నాకంట నీరు నిండెను. భగవంతుని భక్తవంతుని భక్తవత్సలతను గాంచఁగానే నా హృదయము కరిగిపోయెను. శ్యామసుందరుఁడెన్నటికిని నన్ను వీడఁడని నా కాదినమున విశ్వాసము కలిగెను.

దేవేంద్రుఁడు వరములిత్తుననఁగానే భగవానుఁడాతనితో నిట్లనెను :- " దేవరాజా ! నీవు నాకు వరమీయవలెనని కోరునెడల నాకు , నర్జునునకు ఇట్టి ప్రగాఢమైత్రియే యుండునట్లు వరమిమ్ము".

రాజా ! ఇదెట్టి యద్భుతవాక్కు ! నిజముగ నీ వరము నెనడుగవలసినది. ఆప్తకాముఁడగు నాయదునందునున కెవరి మైత్రితో నేమిప్రయోజనము ? ప్రపంచములోని లక్ష్మియంతయు నెవని పాదములకడ పొరలాడుచుండునో, అట్లు పొరలాడు చున్నను ఎవఁడు దానివైపు కన్నెత్తైనఁ జూడఁడో అట్టి శ్రీపతికి క్షుద్రుఁడనగు నామైత్రివలన నేమిప్రయోజనము ? ఆఁకలికొన్న వాఁడాహారమునకై పరితపించునట్లు, మిక్కిలి దప్పికకొన్నవాఁడు అప్పులకై అలవటించునట్లు, ఘోరకామి కామినీకొఱకు దేవులాడినట్లు నేను భక్తులకృపకై యట్లలవటించుచుందునని చూపు టకా యన్నట్లు శ్రీకృష్ణుడు తన భక్తవత్సలతను జూపించెను. రాజా ! ఆతఁడీమాటను ఊరక నోటితో ననలేదు. జీవితకాల మంతయు దానిని ఁ జెల్లించుకొనెను. మన హితముకొఱ కాతఁడెల్లప్పుడు సావధానముగ తత్పరుఁడై యుండెడువాఁడు. మనకేది హితమో దానిని సమస్తోపాయములచేఁ జేయుచుండెడివాఁడు.కాని చివరకు ఆతఁడు నన్ను మోసగించెను. స్వధామమునకు వెళ్లునప్పు డాతఁడు పాపినగు నన్నుఅయోగ్యుఁడని గ్రహించి ఆతని వెంటఁ గొ నిపోలేదు. నన్నిక్కడ ఏడ్చుటకై వదలి పోయినాఁడు."

ఛప్పయ

రాజ 9! అతికమనీయ కృష్మ కీ అకథ కహానీ |

ప్రేమామృతమేఁ సనీ సరస సుఖదాయక బానీ ||

ఖాండవ కో కరి దాహ అగ్ని భర పేట్‌ అఘాయే |

దోనోఁకూఁవర దేన దేవపతి దౌరే ఆయే ||

మైఁనే మాంగే అస్త్రవర, వర మాంగే హరి హియ భ##రే |

అరజున కేసంగ మిత్రతా, మేరీ నిత బఢిబో కరే ||

అర్ధము

అన్నా ! ధర్మరాజా ! వర్ణింప వీలులేని అతికమనీయమగు శ్రీకృష్ణునికథ ప్రేమామృతములో ముంచిన సరసవాక్కులు కలది. అది సుఖదాయక మైనది. అగ్నిహోత్రుఁడు తనపొట్ట ఖాండవవనమును దహించి నిండించు కొనెను. అప్పుడు దేవేంద్రుఁడు మమ్ముల నిద్దరను రెండు వరములు కోరుకొమ్మనెను.

నేను సర్వాస్త్రశస్త్ర విశారదుఁడ నగునట్లు కోరుకొంటిని. కృష్ణుఁడు హృదయపూర్వకముగ నర్జునునితోడి సాంగత్యము, మిత్రత్వము నిత్యనూతనముగ వర్థిల్లవలెనని కోరుకొనెను.

BHAGAVATA KADHA-3    Chapters